Ask Why? - National Scientific Temper Day
జాతీయ శాస్త్రీయ దృక్పథ దినం – 20 ఆగస్టు, 2108
ఆల్ ఇండియా పీపుల్స్ సైన్స్ నెట్‌వర్క్ ప్రకటన
భారతదేశంలో శాస్త్రీయ భావజాల వ్యాప్తి పై అనుచితమైన దాడి జరుగుతుంది.
ప్రజల్లో శాస్త్రీయ భావజాల వ్యాప్తికై కృషి చేసిన ‘సైంటిఫిక్ టెంపర్ ఛాంపియన్’ డాక్టర్ నరేంద్ర దభోల్కర్ స్మృతిలో, ఆగష్టు 20వ తేదీ ”నేషనల్ సైంటిఫిక్ టెంపర్ డే” గా గుర్తించబడింది. ఐదు సంవత్సరాల క్రితం 2013లో ఇదే రోజున దభోల్కర్ మత చాందసవాదులచే క్రూరంగా చంపబడుట దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. ఆ తరువాత అనేక సార్లు అదే విధమైన హత్యలు జరిగాయి. కులాంతర వివాహాలకు మద్దతు ఇచ్చినందుకు, శివాజీ వాస్తవిక వారసత్వంపై ప్రసంగిచినందుకు, మహాత్మా గాంధీ హత్యను మహాత్తర కార్యంగా అభివర్ణించడాన్ని ఖండించినందుకు గోవింద్ పన్సారే 2015లో చంపబడ్డాడు. కర్ణాటకలో 12వ శతాబ్దం నాటి సామాజిక మత సంబంధ సంస్కరణలను మరియు మతపరమైన ఉద్యమాల చరిత్రను అధ్యయనం చేసిన ఆచార్య ఎంఎం కల్బుర్గి 2016 లో హత్య చేయబడ్డారు. మత వివక్షతను తీవ్రంగా విమర్శించినందుకు 2017లో సాహసోపేతమైన పాత్రికేయురాలు గౌరీ లంకేష్‌ను తుపాకితో కాల్చి చంపారు. ఈ హత్యలన్నీ బహుశా ఒకే అతివాద బృందంచే చేయబడ్డాయి. అయితే ఈ అన్ని ఘటనల వెనుక ఉన్న ఉమ్మడి కారణం హేతువాద దృక్పథం, శాస్త్రీయ చైతన్యం పెరగడం తమ మనుగడకే ప్రమాదమని మత చాందసవాదులు భావించడం.
ప్రధాన మత చాందసవాద శక్తులు మరియు అధికారంలోఉన్న రాజకీయశక్తులు, శాస్త్రీయ భావజాల ప్రచారకులపై చూపే అతివాద ధోరణులను ఈహత్యాకాండలు బహిర్గతం చేస్తున్నాయి. మత విద్వేషాలను రెచ్చగొట్టడం, ద్వేషపూరిత ప్రచారాలు, సామాజిక మాధ్యమాల ద్వారా నకిలీ వార్తల నిరంతర వ్యాప్తి, ”ప్రత్యామ్నాయ వాస్తవాలు” అని భూటకపు చరిత్రల ప్రచారం కొనసాగుతుంది. వీరి దురాగతాలను ప్రశ్నించే వారిని హింసించడం, హత్యగావించడం కూడా జరుగుతుంది.
సైన్స్ మరియు టెక్నాలజీలో గొప్ప విజయాలన్నిటికి ఊహాత్మక స్వర్ణకాలమైన వేదకాలంనాటి వేదాలే మూలమని ఈ దళాలచే ప్రచారం చేయబడుతోంది. హేతుబద్ధమైన ఆలోచనల గొప్ప సాంప్రదాయాలు భారత ఉపఖండం నుండే ఉత్పన్నమయ్యాయన్న విషయాన్ని ప్రక్కదారి పట్టించి, పురాణాలను విజ్ఞానశాస్త్రానికి ఆపాదించి వినాయకుని తల మార్పిడిని శస్త్రచికిత్సగా, వైమానిక, అంతరిక్ష సాంకేతికత, టెలివిజన్ మరియు ఇంటర్నెట్ మన పూర్వీకులకు ఎప్పుడో తెలుసునని, మహాభారత సమయంలోనే కౌరవ జననం విట్రో ఫలదీకరణం వలన జరిగిందని, ఇదంతా చరిత్రను లిఖించడం ప్రారంభించక వేలసంవత్సరాల మునుపే సంభవించిందని కేంద్ర మరియు రాష్ట్ర మంత్రులు, ముఖ్యమంత్రులు రాజకీయ కార్యకర్తలు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఐన్‌స్టిన్ E=MC2 కంటే గొప్ప సిద్ధాంతాలను వేదాలు నిక్షిప్తం చేసుకొన్నాయనే అహేతుకమైన అద్భుత ప్రచారం కేంద్ర మరియు రాష్ట్ర నాయకులు చేస్తున్నారు.
అంతేకాక భారత ఉపఖండంలో జైన, బౌద్ధ, ఇస్లాం, ఆదివాసీ, ద్రవిడుల వంటి వివిధ మతాల, జాతుల వారి కృషి వలన మానవ జీవన ప్రమాణ గతిని మార్చిన నిజమైన ఆవిష్కరణలు నిర్లక్ష్యం చేయబడుతున్నాయి. కళలు, సాంకేతికత మరియు ఉత్పాదక శక్తుల అభివృద్ది చురుకుగా పాల్గొన్న వివిధ కులాలవారు, ఆదివాసీయులు కూడా నిర్లక్ష్యం చేయబడ్డారు. ఇది సామాజిక అంధత్వాన్ని, పక్షపాత వైఖరిని తేటతెల్లం చేస్తుంది. ప్రపంచ శాస్త్రసాంకేతిక రంగాలకు మన దేశ పౌరులు అందించిన నిజమైన ఆవిష్కరణలను అర్డంచేసుకొని, ప్రచారం చేసినప్పుడే భారత నాగరిక చరిత్రకు నివాళి అర్పించినట్టు.
శాస్త్రవేత్తలు, ప్రఖ్యాత మేధావులు, నోబెల్ గ్రహీతలు సహా దేశవిదేశాల నుండి ఇటువంటి భావాజాలానికి నిరసనలు తెలిపినందుకు వారిపై దేశద్రోహులు, పాశ్చాత్య సంస్కృతిని ప్రోత్సహించేవారు మరియు ”మెకాలే యొక్క వారసులు” అనే నెపంతో దాడులు చేసారు. సూడో చరిత్రలు మరియు శాస్త్రీయ వ్యతిరేక అభిప్రాయాలు పాఠశాల పాఠ్యాంశాల్లో, కళాశాల మరియు విశ్వవిద్యాలయ బోధనలలో చేర్చబడ్డాయి. ఈ వాదనలను రుజువుచేయటానికి, విజ్ఞాన శాస్త్రాలు మరియు సాంఘిక శాస్త్రాల రెండింటిలో జరిగే పరిశోధనలకు ప్రభుత్వం అధికారికంగా నిధులు సమకూరుస్తుంది. విశ్వవిద్యాలయాలు నిరంతరం దాడులు చేసే ప్రాంతాలుగా మారాయి. తరచూ సాహిత్య పరంగా, మేధో స్వయంప్రతిపత్తి పై మరియు విశ్లేషాత్మక ఆలోచనలు చేసేవారి పై దాడులు జరుగుతున్నాయి.
దూకుడు కూడిన విజ్ఞాన శాస్త్ర వ్యతిరేక, అహేతుక వాతావరణం ఈ అస్పష్టమైన శక్తులు చేత ప్రేరేపింపబడుతుంది. వీరు అధికారిక మద్దతుతో భయంగొలిపే హింసాత్మక వాతావరణాన్ని సృష్టించి మన విద్యా మరియు మేధో సంస్థలలో శాస్త్రీయ అభివృద్ది దృక్పథాన్ని, హేతుబద్దమైన ఆలోచలను అణచివేసే ప్రయత్నాలు చేస్తున్నారు. సాంఘిక శాస్త్రం పరిశోధనలు, నియంత్రణలకు గురవుతుండగా, శాస్త్రీయ పరిశోధనల కోసం నిధులు కత్తిరించబడుతున్నాయి.
సైన్స్ అండ్ టెక్నాలజీ మరియు ఇతర పరిశోధనల సూచనలు లేకుండా అభివృద్ది కార్యక్రమాలు రూపొందించ బడుతున్నాయి. పరిశ్రమల, వ్యవసాయ రంగాల్లో అభివృద్ది విధానాలు, విద్యుత్, బొగ్గు, చమురు, వాయువు, రవాణా వంటి కీలకమైన మౌళిక సదుపాయాలు పేద, మధ్యతరగతి ప్రజల కోసం కాక కార్పొరేట్ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని పొందించబడుతున్నాయి. పర్యావరణ పరిరక్షణకు ఏవిధమైన ప్రాజెక్టులు రూపొందించలేదు. అణు విద్యుత్, బుల్లెట్ ట్రైన్, స్మార్ట్ సిటీస్ మొదలైన మెగాప్రాజెక్టుల రూపకల్పనలో ప్రజా క్షేత్రంనుండి ఎటువంటి శాస్త్రీయ అభిప్రాయ సేకరణ చేపట్టలేదు. పరిశ్రమలు, వ్యవసాయం, ఆహారం, నీరు, ఆరోగ్యం వంటి ప్రాథమిక అవసరాల కోసం ఏలాంటి శాస్త్రీయ ప్రజాచర్చ చేయడంలేదు. సైన్స్ అండ్ టెక్నాలజీ యొక్క ఈ క్రమబద్ధమైన విలువ తగ్గింపు, విద్యా సంస్థలు మరియు సమాజంలో విమర్శనాత్మక ఆలోచనలను అణచివేయడం వలన దేశం భవిష్యత్తులో భారీగా మూల్యం చెల్లించుకోవాలి, దాని ఫలితంగా ఈ విజ్ఞాన యుగంలో ముఖ్యంగా దేశ యువత తీవ్రంగా నష్టపోతోంది.
సైంటిఫిక్ టెంపర్ డే ను పురస్కరించుకొని, మన రాజ్యాంగం యొక్క ఆదేశిక సూత్రాలలో ఆదేశించిన విధంగా పౌరులందరు, ముఖ్యంగా శాస్త్రవేత్తలు మరియు సాంఘిక శాస్త్రవేత్తలు ప్రాథమిక విధిగా శాస్తీయ దృక్పథాన్ని ప్రోత్సహించడం, ప్రశ్నించే హక్కు, విజ్ఞానశాస్త్రం మరియు ప్రజాస్వామ్య విలువల గురించి చర్చించాల్సిన అవసరం ఉంది. శాస్త్రీయ దృక్పథాన్ని, విమర్శనాత్మక ఆలోచనా పద్ధతిని ప్రోత్సహించడమేకాక, బహుళత్వంపై ఈ దాడిని తీవ్రంగా నిరోధించబడటం చాలా అవసరం. ప్రజాస్వామ్యం మరియు భారత రాజ్యాంగాలను కాపాడడంలో సైన్స్ నేడు కీలక పాత్ర పోషిస్తోంది. నేషనల్ సైంటిఫిక్ టెంపర్ డే సందర్భంగా శాస్తీయ దృక్పథాన్ని ప్రోత్సహించి, మతపరమైన ద్వేషపూరిత రాజకీయ సిద్ధాంతాలను ఓడించడానికి అన్ని సంస్థలు, వ్యక్తులు కలిసి పనిచేయడం అవసరమని ఎ.ఐ.పి.ఎస్.ఎన్ విజ్ఞప్తి చేస్తుంది. మానవత్వ విలువలుగల, హేతుబద్ధ, విజ్ఞాన పరిపుష్ట మరియు సాధికార పౌరులుగల భారతదేశాన్ని నిర్మించడానికి చేతులు కలుపుదాం!
ఆల్ ఇండియా పీపుల్స్ సైన్స్ నెట్‌వర్క్‌లో భాగస్వామి అయిన జనవిజ్ఞాన వేదిక ఈ ప్రకటనను స్వాగతిస్తు, సంపూర్ణ మద్దతును ప్రకటిస్తున్నాం. శాస్త్రీయ దృక్పథ అధ్యాయనం, విస్తరించడంలో మీ సహకారాన్ని మరియు భాగస్వామ్యాన్ని కోరుతున్నాం.